జారుతున్న సెంట్రల్ కోర్టు ... బోరున ఏడుస్తూ నిష్క్రమించిన సెరీనా
ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నీల్లో ఒకటైన్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ అమెరికాలోని సెంటర్ కోర్టులో జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి రౌండ్‌లోనే అమెరికా టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ నిష్క్రమించింది. సెంటర్ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో ఆమె తొలుత బేస్‌లైన్ వద్ద జారింది. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్లీ ఆడిన సెరీనా.. తన ఎడమ కాలి మడిమ పట్టేయడంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పింది.
ఆలియా సండ్రా సాస్‌నోవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత లీడింగ్‌లో ఉన్న టెన్నిస్ దిగ్గజం సెరీనా ఆ తర్వాత గాయంతో చితికిలపడింది. తొలి సెట్‌లో 3-3 స్కోర్ తో సమంగా ఉన్న సమయంలో సెరీనా ఆట నుంచి రిటైర్ అయ్యింది. కన్నీటిపర్యంతమైన సెరీనాకు వింబుల్డన్ ప్రేక్షకులు గుడ్‌బై చెప్పారు. 24వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన సెరీనాకు ఆ రికార్డు అందని ద్రాక్షగా మారింది. 2017 తర్వాత సెరీనా ఇప్పటివరకు గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవలేదు.
మరోవైపు, వింబుల్డన్ సెంటర్ కోర్టుపై విమర్శలు వస్తున్నాయి. గ్రాస్‌కోర్టు చాలా స్లిప్పరీగా మారిందని ప్లేయర్లు తప్పుపడుతున్నారు. గడ్డి ఎక్కువగా ఉండే వింబుల్డన్ మైదానాల్లో ఆటగాళ్లు ఎక్కువగా జారిపడే అవకాశాలు ఉంటాయి. అయితే మంగళవారం ఇద్దరు ప్లేయర్లు జారడంతో వారు ఆట నుంచి తప్పుకున్నారు.
సెరీనా కన్నా ముందు ఫెదరర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడ్రియన్ మన్నరినో కూడా బేస్‌లైన్ వద్ద స్లిప్ అయ్యాడు. దీంతో అతనికి కూడా మడిమ పట్టేసింది. ఆ ప్లేయర్ కూడా మధ్యలోనే రిటైర్ కావాల్సి వచ్చింది. ఇద్దరు ప్లేయర్లు వరుస మ్యాచ్‌ల్లో గాయపడడంతో.. సెంటర్ కోర్టుపై విమర్శలు వెల్లువెత్తాయి.