మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (09:09 IST)

లగడపాటిది సర్వే కాదు చిలక జోస్యం : కేటీఆర్ సెటైర్లు

సర్వేల కింగ్‌గా పేరుగాంచిన మాజీ ఎంపీ, ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్‌పై తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. లగడపాటి చెప్తున్నది సర్వేల ఫలితం కాదని చిలుక జోస్యం అంటూ ఎద్దేవా చేశారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీల సారథ్యంలోని ప్రజా కూటమి విజయం సాధిస్తుందని లగడపాటి పదేపదే చెప్పడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ప్రచారం చివరి అంకానికి చేరుకుందని ఇపుడు సర్వేల పేరుతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 
 
లగడపాటి రాజగోపాల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. ఇద్దరూ పొలిటికల్ టూరిస్టులే అన్నారు. డిసెంబర్ 11వ తేదీ ఫలితాల రోజున ఇద్దరూ తట్టాబుట్టా సర్దేస్తారని.. వెయిట్ అండ్ వాచ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 
 
అదేసమయంలో లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలను తప్పుపట్టడానికి కారణాలను కూడా కేటీఆర్ వివరించారు. తనకు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నవంబర్ 20వ తేదీన లగడపాటి ఓ సర్వే రిపోర్టును పంపించారన్నారు. అందులో తెరాస విజయం స్పష్టంగా కనిపించింది అంటూ… లగడపాటితో చేసిన వాట్సప్ చాట్ వివరాల స్క్రీన్ షాట్‌ను.. కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. తెరాసకు 65 నుంచి 70 సీట్లు వస్తాయని లగడపాటి సర్వే వివరాలను తనకు పంపించినట్టు చెప్పారు. 
 
చంద్రబాబు చేసిన ఒత్తిడితో అదే సర్వే రిపోర్టులో అంకెలు మార్చి లగడపాటి తప్పుగా ప్రకటించారన్నారు. చివరి రెండు వారాలుగా తెరాస పలు అంశాలను బాగా డీల్ చేసిందని అందుకే పరిస్థితి మెరుగయ్యిందని కేటీఆర్ చెప్పారు. నవంబర్ 20వ తేదీన సర్వే వివరాలను పంపిన లగడపాటికి…. 70 మార్క్ దాటి చూపించి సర్ ప్రైజ్ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.