శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (10:11 IST)

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. రేవంత్‌కు పోటీనా?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన కుమారుడైన కల్వకుంట్ల తారక రామారావును ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. టీఆర్ఎస్‌కు తాను అధ్యక్షుడిగా తన కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటారని ఆయన ప్రకటించారు. దీంతో కేటీఆర్‌కు కీలక బాధ్యతలను అప్పగించినట్టయింది. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కేటీఆర్ అత్యంత కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే. ఫలితంగానే మంగళవారం వెల్లడైన అసెంబ్లీ ఫలితాల్లో తెరాస ఏకంగా 119 సీట్లలో పోటీ చేసి 88 సీట్లను కైవసం చేసుకుంది. ఫలితంగా కేసీఆర్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఆ ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా గడవకముందే కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అదేసమయంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టిసారించనున్నారు. పార్టీ కార్యవర్గ సమావేశానికంటే ముందుగానే కేసీఆర్ అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
ఇదిలావుండగా, తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న కాంగ్రెస్ నేత అనుమోలు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. యువనేతగానేకాకుండా, మంచి ప్రజాబలం ఉన్న నేతగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి అన్నీతానే వున్నారు.