జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు : బరిలో 58 మంది అభ్యర్థులు
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తుది బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఈ ఉప ఎన్నికల్ పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరుగనుంది. ఇందులో మొత్తం 58 మంది పోటీలో నిలిచినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో ఇవాళ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం చరిత్రలో ఇంతమంది పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గత 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వడం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల పరిశీలనతోపాటు ఉపసంహరణ వరకు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ ఉపఎన్నికలో చివరకు 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
అయితే, ఈ స్థానంలో ఇంతమంది అభ్యర్థులు పోటీ చేయడానికి కారణం లేకపోలేదు. పలువురు అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తమ ఉద్యమానికి వేదికగా మలచుకునేందుకు, తమ సమస్యలను ఫోకస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ కారణాలు పేర్కొంటూ నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు, ఇతరులు రూ.10 వేలు చెల్లించిమరీ నామినేషన్లు వేశారు. ప్రధానంగా ప్రాంతీయ రింగు రోడ్డు భూసేకరణ నిర్వాసితులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వేశారు.