జడ్పీ హైస్కూలు విద్యార్థులతో తన పదో వార్షికోత్సవం జరుపుకున్న ఆర్క్ సెర్వ్
ఆర్క్ సెర్వ్ సంస్థ తన పదో వార్షికోత్సవాన్ని మణికొండలోని జడ్పీ హైస్కూలు విద్యార్థులతో కలిసి చేసుకుంది. అగ్రశ్రేణి విద్యార్థులు సాధించిన విజయాలకు గాను వారికి బహుమతులు ఇవ్వడంతో పాటు స్థానిక విద్యా కార్యక్రమాలకు మద్దతు పలికింది. 2022లో మణికొండ జడ్పీ హైస్కూలును దత్తత చేసుకున్నప్పటి నుంచి ఆర్క్ సెర్వ్ సంస్థ తన సీఎస్ఆర్ కార్యక్రమాలతో 1,473 మంది పిల్లలపై సానుకూల ప్రభావం చూపింది.
అగ్రశ్రేణి ఫలితాలు సాధించిన విద్యార్థులు డి. కుష్వంత్ రణచంద్రవర్మ (పదో తరగతి పరీక్షల్లో 10/10), ఎస్. భార్గవి (9.8/10), బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన ఎం. మిర్యామిలను ఆర్క్ సర్వ్ సంస్థ ఈ కార్యక్రమంలో సత్కరించి, వారికి ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఆర్క్ సర్వ్ సంస్థ సీఈఓ క్రిస్ బాబెల్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ ఈవీపీ మైఖేల్ లిన్, వైస్ ప్రెసిడెంట్, జీఎం అంబరీష్ కుమార్, హెచ్ఆర్ డైరెక్టర్ కరుణ గెడ్డం, ఫెసిలిటీస్, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్, సిఎస్ఆర్ లీడ్ స్వాతి తిరునగరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్క్ సర్వ్ సంస్థ సీఈఓ క్రిస్ బాబెల్ మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లలో ఈ పాఠశాల విద్యాపరంగా, మౌలిక వసతుల పరంగా ఎంతో పురోగతి చూపించిందని, ఉపాధ్యాయులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, పరీక్షల్లో మార్కులు బాగా వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ తరగతి గదులను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు క్రీడామైదానాలనూ మెరుగుపరిచామని చెప్పారు. ఒకప్పుడు కేవలం 1,300కు పైగా మాత్రమే విద్యార్థులు ఉండే ఈ స్కూల్లో ఇప్పుడు గణనీయమైన ప్రగతి కనిపిస్తోందన్నారు. ఇక్కడి ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్ అనే సంస్థకు రూ. 8 లక్షల విరాళం ఇస్తున్నామని, దీంతో ఆ సంస్థ ఉన్నత తరగతుల కోసం ఏడుగురు అదనపు ఉపాధ్యాయులను నియమిస్తుందని తెలిపారు. 2022-23లో పదో తరగతి ఫలితాలు 182 మాత్రమే ఉండగా 2023-24లో అది 204కు పెరిగి, 10.78% వృద్ధి కనిపించిందన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో కూడా ఆర్క్ సెర్వ్ సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. రుతుక్రమ విషయంలో విద్యార్థినులకు అవగాహన కల్పించడం, శానిటరీ నాప్కిన్ల పంపిణీతో పాటు.. నిర్మాణ్ సంస్థ సహకారంతో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. పిల్లలకు క్రీడా పరికరాలు, ఇతర పరికరాలు అందిస్తోంది.