శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (12:23 IST)

ఈ నెల 15న తెలంగాణాలో సెలవు దినం... ఎందుకో తెలుసా?

revanth
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీన పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సేవాలాల్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సేవాలాల్ తన ప్రబోధనలతో బంజారాలను తీవ్రంగా ప్రభావితం చేశారని ఆయన కొనియాడారు. అందుకే ఆయన జయంతిని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన సెలవు దినంగా ప్రకటించినట్టు తెలిపారు.
 
సేవాలాల్ మహరాజ్ అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి సమీపంలోని సేవాగఢ్‌లో 1739 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారని బంజారాలు విశ్వసిస్తారు. ఆయన ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాకుండా గొప్ప సంఘసంస్కర్త కూడా. 18వ శతాబ్దంలో బంజారాలు, బ్రిటీష్, ముస్లిం పాలకుల ప్రభాంతో ఇతర మతాల్లోకి మారకుండా సేవాలాల్ ఎంతో కీలక పాత్రను పోషించారు. బ్రహ్మచారి అిన సేవాలాల్ తన బోధనలతో బంజారాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. అందుకే ఆయన జయంతి వేడుకలను బంజారాలు ఒక పండుగలా జరుపుకుంటారు. అలాంటి మహనీయుడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని అనేక మంది స్వాగితిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.