టెక్కీ నిర్లక్ష్యపు డ్రైవింగ్: ఒకరు మృతి.. ఎనిమిది మందికి గాయాలు
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆరు ప్రమాదాలకు కారణమైనట్లు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రమాదాలకు కారణమైన వ్యక్తిని హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న పి క్రాంతి కుమార్‌గా గుర్తించారు.
క్రాంతి కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. టెక్కీ నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఆరు రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఒక కారు, ఒక ఆటో, మూడు బైక్‌లు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు.
రాయదుర్గంలోని ఐకియా నుంచి కామినేని హాస్పిటల్ రోడ్డు వరకు గల మార్గంలో అర్ధరాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్య ప్రమాదాలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది.
మోటారు వాహన చట్టం ప్రకారం, మద్యం సేవించి వాహనం నడపడం శిక్షార్హమైన నేరం, ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.2,000 వరకు జరిమానా విధించవచ్చు.