పాఠాలు అర్థం కావడం లేదని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలో ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాకపోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. రాష్ట్రంలోని ఎల్కతుర్కి మండలం గోపాల్ పూర్‌లో ఈ ఘటన జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన కృష్ణాకర్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. చిన్న కుమార్తె జె.కీర్తన (19) హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అధ్యాపకులు చెప్పిన పాఠాలు అర్థం కావటం లేదని, తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక పోతున్నానని ఫోన్ చేసి బాధపడేది.
దీంతో ఆమెను ఇంటికి రప్పించి, వేరే కళాశాలలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతలో ఏమైందో.. ఈ నెల 10న శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొంది. తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి కృష్ణాకర్ గమనించి వెంటనే కిందకు దించి గ్రామంలోని ఆర్‌ఎంపీని పిలిపించి పరీక్షించగా.. అప్పటికే మృతి చెందింది. శనివారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.