బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (15:15 IST)

వేగవంతమైన అభివృద్ధి కోసం బృహత్ ప్రణాళిక : సీఎం రేవంత్ రెడ్డి

revanth reddy
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు వీలుగగా ఒక బృహత్ ప్రణాళిక ఉండాలనేదే తమ ప్రభుత్వ విధానమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని నానక్ రాంగూడలో రూ.17 కోట్ల వ్యయంతో క్రెడాయ్ నిర్మించిన అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యావత్ తెలంగాణలో వేగవంతమైన అభివృద్ధి కోసం ఒక బృహత్ ప్రణాళిక ఉండాలనేది తమ ప్రభుత్వ విధానమన్నారు. 
 
తెలంగాణ 2050-మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. ఓఆర్ఆర్ లోపల వరకూ అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ పెరి అర్బన్ తెలంగాణ, ఆర్ఆర్ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకూ రూరల్ తెలంగాణగా విడగొట్టి అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. చైనాలో ప్రపంచంలో ఎలాంటి వస్తువు కావాలన్నా దొరికేలా సిటీలను అభివృద్ధి చేశారన్నారు. ఇక్కడా అలాగే చేయాలనుకుంటున్నట్టు సీఎం చెప్పారు. 
 
మౌలిక వసతుల రంగాన్ని ప్రోత్సహించాలనేదే తమ విధానమని వివరించారు. ఫార్మా సిటీని తరలిస్తున్నారని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మా సిటీ కాకుండా ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసం మెట్రోను నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రతిపాదించినట్టు చెప్పారు. మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
 
ఒకప్పటి మతకల్లోల పరిస్థితుల నుంచి హైదరాబాద్ ను అప్పటి ప్రభుత్వాలు బయటకు తీసుకొచ్చాయన్నారు. సీఎంలుగా పనిచేసిన చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ రాజకీయం, ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో అంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించారన్నారు. ఈ సంప్రదాయం ఇక మూందూ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు.