మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (08:54 IST)

కేసీఆర్ బడ్జెట్లో ఏం ఇస్తారో?.. బడ్జెట్​పై 12 గంటల పాటు సమీక్ష

ఆర్థికమాంద్యం నేపథ్యంలో అవలంభించాల్సిన ఆర్థిక విధానం, సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై సర్కార్ దృష్టి సారించింది. బడ్జెట్ ప్రతిపాదనల ఖరారు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలకు శ్రీకారం చుట్టారు.

ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పద్దును సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే వారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున... రాష్ట్ర ప్రభుత్వం పద్దు కసరత్తును వేగవంతం చేసింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా శాఖలు ఇప్పటికే ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందించాయి. ఆ ప్రతిపాదనల ఆధారంగా ఆర్థిక శాఖ ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. 12 గంటల సుదీర్ఘ భేటీ ఆర్థిక శాఖ ప్రాథమిక కసరత్తు పూర్తైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్​కు తుది రూపకల్పనలు ప్రారంభించారు.

మంత్రులు హరీశ్​ రావు, కేటీఆర్​లతో ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన చర్చ రాత్రి 11.30 గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో... 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆయా శాఖలకు చేసిన కేటాయింపులు, అందులో చేసిన ఖర్చులు, తదితర వివరాలను పరిశీలించారు.

ప్రాధాన్య పథకాలకు వచ్చే ఏడాది చేయాల్సిన కేటాయింపులపై అధికారులతో చర్చించారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో లోతు విశ్లేషణ ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్ర సొంత రాబడులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏ మేరకు తగ్గాయి ? వచ్చే ఏడాది ఎలా ఉండవచ్చు? తదితర అంశాలను సీఎం పూర్తిస్థాయిలో సమీక్షించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన హామీలు, బడ్జెట్​లో అందుకు కేటాయించాల్సిన నిధులు, వాటి సర్దుబాటు విషయమై చర్చించారు.

దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్రంలో అవలంభించాల్సిన ఆర్థిక విధానంపై లోతుగా విశ్లేషించారు. స్వీయ ఆదాయం పెంచుకునే మార్గాలు, తదితర అంశాలపై కసరత్తు సుదీర్ఘంగా సాగింది.