శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (09:36 IST)

సీజన్‌తో సంబంధం లేదు.. వ్యాధుల క్యాలెండర్‌ను రిలీజ్ చేసిన ఆరోగ్య శాఖ

గత యేడాదిన్నర కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అనేక మంది పిట్టల్లా రాలిపోగా, మరికొందరు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ యేడాది సీజన్‌తో సంబంధం లేకుండా కరోనా సోకే అవకాశం ఉందనీ, ఈ వ్యాధులకు సంబంధించిన క్యాలెండర్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఇదే అంశంపై ఆరోగ్య శాఖ హెచ్చరికలు చేసింది. 
 
ముఖ్యంగా, డెంగీ, మలేరియా, ఇతర వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు సీజన్‌గా వస్తుంటాయి. అయితే సీజన్‌కు సంబంధం లేకుండా ఏడాది కాలంగా ఎప్పుడైన కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రతి నిత్యం జాగ్రత్తగా ఉండాలని సీజన్‌ వ్యాధులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ క్యాలెండర్‌ను విడుదల చేసింది. 
 
జూలై నుంచి అక్టోబర్‌ మధ్య డెంగీ, మలేరియా, సీజన్‌ జ్వరాలు, అలాగే నవంబర్‌- మార్చి మధ్య స్వైన్‌ ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని, ఏప్రిల్‌ - జూన్‌ మధ్య వడ దెబ్బ, మలేరియా వంటివి వెంటాడుతుంటాయి. కానీ కరోనా మాత్రం ఏడాది పొడవునా పట్టి పీడించే అవకాశం ఉందని తెలిపింది. 
 
సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని, తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషించాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కోరింది. 
 
ఇక సీజనల్‌ అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు 24 గంటలపాటు నడిచే ప్రత్యేక సెల్‌ను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. దీనికి 040-24651119 ఫోన్‌ నెంబర్‌ కేటాయించింది. అంటు వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఈ సెల్‌ ద్వారా ప్రజలు అధికారులకు తెలియజేయవచ్చు.