మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జూన్ 2021 (09:06 IST)

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. పార్టీలోని పలువురు సీనియర్ల అభ్యంతరాలను కూడా పక్కన పెట్టి ఎంపీ రేవంత్‌ రెడ్డిని టీపీసీసీకి నూతన సారథిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఎంపిక ప్రక్రియను కొలిక్కి తెస్తూ.. రేవంత్‌కు పగ్గాలు అప్పగించింది. 
 
పీసీసీ అధ్యక్షుడితోపాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ వంటి కీలక పదవుల నియామకాలనూ చేపట్టింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం వివరాలు వెల్లడించారు. వాస్తవానికి రెండేళ్ల కిందటే టీపీసీసీకి నూతన సారధి ఎంపికపై కసరత్తు చేసిన అధిష్ఠానం.. వివిధ కారాణాల వల్ల వాయిదా వేస్తూ వస్తోంది. 
 
అయితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, వరుస ఓటముల నేపథ్యంలో దూకుడుగా వ్యవహరించే, ప్రజాకర్షణ కలిగిన నేతను ఎంపిక చేయాలన్న ఆలోచనతో అధిష్ఠానం ఉంది. దీంతో మొదటి నుంచీ రేవంత్‌ రెడ్డి పేరే వినిపిస్తూ వస్తోంది. అయితే పీసీసీ మాజీ చీఫ్‌ వి.హన్మంతరావు సహా పలువురు సీనియర్‌ నేతలు రేవంత్‌రెడ్డి పేరు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అధిష్టానానికి లేఖలు రాశారు. వీహెచ్‌ అయితే బహిరంగంగానే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 
 
రేవంత్‌ రెడ్డికి ప్రత్యామ్నాయంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మధుయాష్కి గౌడ్‌ తదితరుల పేర్లనూ ప్రతిపాదించడం, అధిష్టానం పరిశీలించడమూ జరిగింది. అయితే ప్రజాకర్షణతోపాటు యువతను సమీకరించడం, పార్టీ నిర్మాణం, రాష్ట్రమంతా తిరిగే శక్తి.. వీటికితోడు సీఎం కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిగా రేవంత్‌నే అధిష్టానం పరిగణనలోకి తీసుకుంది. 
 
పీసీసీ అధ్యక్షునిగా నియమితుడైన రేవంత్‌ రెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుని హోదాలో గతంలో తన వైఖరికి కాస్త భిన్నంగా విధానపరమైన అంశాలనే ఎక్కువగా ఫోకస్‌ చేస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతారని చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అమలుచేసే విధానాలను అధిష్ఠానం అనుమతితో వివరిస్తూ వెళ్తారని అంటున్నారు. 
 
అయితే ఇప్పటిదాకా మాటకు మాట, విమర్శకు ప్రతి విమర్శతో దూకుడుగా వ్యవహరించిన రేవంత్‌రెడ్డి.. కొత్త పాత్రను నిర్వహించాల్సి ఉంది. ముఖ్యంగా అంతర్గత పోరు, అసంతృప్తి, అసమ్మతులు ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌ పార్టీలో అందరినీ కలుపుకొనిపోవడం ఆయనకు సరికొత్త సవాల్‌గా మారనుంది. ఆయన కూడా అందుకు అనుగుణంగానే ఆలోచన చేస్తున్నట్లు రేవంత్‌ అనుచర వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షునిగా నియమించిన వెంటనే రేవంత్‌.. సీనియర్‌ నేత జానారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ నివాసాలకు వెళ్లి వారిని కలిశారు. 
 
స్వగ్రామం: 
నాగర్‌ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామం.
జననం: 1967 నవంబరు 8.
భార్య: ఎనుముల గీత, కుమార్తె: నైమిషా రెడ్డి.
విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్‌, ఏవీ కాలేజీ.
దోమల్‌గూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం.
2006లో మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ జడ్పీటీసీ.
2007-2009: ఉమ్మడి ఏపీ శాసనమండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ.
2009-14: టీడీపీ తరపున కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక.
2017 అక్టోబరులో కాంగ్రె్‌సలో చేరిక.
2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకం.
2019 మేలో మల్కాజిగిరి ఎంపీగా గెలుపు.
2021 జూన్‌ 26న టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం.