శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ప్రీతి ఛిఛిలి
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:42 IST)

వారం రోజుల్లో పెళ్లనగా యువకుడి ఆత్మహత్య... కారణమేంటి?

సికింద్రాబాద్‌లోని న్యూబోయిన్‌పల్లిలో శ్రీనివాస్ నగర్‌లో నివాసం ఉంటున్న 31 ఏళ్ల గణేష్ యాదవ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. గణేష్‌కు తండ్రి లేరు, ఉన్న ఇద్దరు అక్కలకు పెళ్లయిపోవడంతో ఇప్పుడు తల్లి జయమ్మతో కలిసి జీవిస్తున్నాడు. గణేష్‌కు పెళ్లి చేయాలని భావించి జయమ్మ గతవారం కార్వాన్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం చేసి, ఫిబ్రవరి 6వ తేదీన పెళ్లి చేయాలని పెద్దలు కుదిర్చారు. 
 
ఏమైందో తెలియదు గానీ ఇటీవల గణేష్ మనస్థాపంగా ఉంటూ తనకు చనిపోవాలని ఉన్నట్లు తరచుగా తల్లి దగ్గర చెప్తుండేవారు. కారణమేంటని తల్లి ప్రశ్నించగా మౌనంగా ఉండేవాడు. పెళ్లి దగ్గర పడుతుండటంలో పెళ్లి పనులలో మునిగిపోయి ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పెళ్లి షాపింగ్‌కు వెళ్లిన జయమ్మ తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు తీసి ఉండటంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా గణేష్ చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు.
 
పోలీసులు గణేష్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సూసైడ్ లెటర్ కోసం శోధనలు చేయగా అటువంటిదేమీ కనిపించకపోవడంలో తల్లి, బంధువులను విచారించారు. ఆత్మహత్యకు గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది.