శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (09:40 IST)

అన్నపూర్ణ క్యాంటీన్లలో ఉచిత భోజనం : మంత్రి కేటీఆర్ ఆదేశం

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరాశ్రయులు, చిరువ్యాపారులు, బీద వారికి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజూ 45 వేల మందికి భోజన సౌకర్యాన్ని జీహెచ్ఎంసీ అందిస్తోంది. 
 
నగరంలో ప్రస్తుతం ఉన్న 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నగరంలోని అన్నార్తులకు రోజు ఐదు రూపాయల భోజనాన్ని జీహెచ్ఎంసీ కల్పిస్తోంది. తాజాగా ఈ కేంద్రాలలో ఉచితంగా భోజ‌నం అందించాల‌ని మంత్రి కేటీఆర్ అధికారుల‌కు సూచించారు. మంగళవారం నుంచే ఫ్రీగా మీల్స్ అందించాల‌ని సూచించారు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చేవ‌ర‌కు ఇదే విధానం కొన‌సాగించాల‌న్నారు.
 
వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకై రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ర‌వాణా వ్య‌వ‌స్థ నిలిచిపోయింది. ఎక్క‌డ ఉన్న ప్ర‌జ‌లు అక్క‌డే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వ‌ర్త‌క వ్యాపార సంస్థ‌లు, విద్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌లు మూసివేయ‌డంతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఇబ్బంది ప‌డుతున్న వ‌ల‌స కార్మికులు, చిరుద్యోగులు, రోజువారి కూలీలు, నిరాశ్ర‌యులు, వ‌స‌తి గృహాల‌లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగుల‌ను ఆదుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. 
 
ప్రస్తుత లాక్‌డౌన్‌లో మరిన్ని అన్నపూర్ణ కేంద్రాలను తెరచి అవసరమైన వారికందరికి అన్నపూర్ణ భోజనాన్ని అందిస్తోంది. ప్ర‌ధాన‌ ఆసుప‌త్రులు, బ‌స్టాండ్‌లు, రైల్వే స్టేష‌న్లు, కూలీల అడ్డాలు, జంక్షన్లు ఉన్న ప్రాంతాల‌లో అన్న‌పూర్ణ కేంద్రాలు న‌డుస్తున్నాయి.