శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (12:10 IST)

హైదరాబాద్‌లో ప్రారంభమైన రష్యా వ్యాక్సిన్ డ్రైవ్

కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ వి టీకాల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతంత కొవిడ్‌పై పోరుకు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తో పాటు భారత్‌లో అత్యవసర వినియోగానికి ఈ స్పుత్నిక్‌-వి అందుబాటులోకి వచ్చింది. 
 
ఈ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ సోమవారం ప్రారంభ‌మైంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ లాంచ్‌ను అపోలో హాస్పిటల్స్ ఆవిష్క‌రించింది. డా. రెడ్డీస్ సిబ్బంది అశోక్‌కు స్పుత్నిక్ మొదటి డోసు వేసి వాక్సినేషన్ డ్రైవ్‌ను మొద‌లుపెట్టింది. 
 
డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో వాక్సినేషన్ పైలెట్ ప్రాజెక్ట్‌ను అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డా. కె.హరిప్రసాద్, డా.రెడ్డీస్ సీఈవో ఎం.వి.రమణ ప్రారంభించారు. 
 
హైదరాబాద్, విశాఖపట్నంల‌లో ఏక‌కాలంలో ఈ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారీ, పంపిణీకి డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే.