బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (15:23 IST)

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత - అడ్డుకున్న తెరాస కార్యకర్తలు

bandi sanjay
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్వాల మండలం వేములలో ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఇక్కడ ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత పాదయాత్ర ముందుకుసాగింది. అయితే, కొందరు స్థానిక తెరాస కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకున్నారు. 
 
దీంతో బీజేపీ కార్యకర్తలు వారితో తలపడటంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ వెంటనే పోలీసులు తెరాస కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సీఎం, తెరాస అధినేత కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, బీజేపీ కార్యకర్తలను మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ నచ్చజెప్పి శాంతింపజేశారు. 
 
అంతకుముందు బండి సంజయ్ మాట్లాడుతూ, నీళ్లు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆయన ఆరోపించారు. అలాగే, గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ మాట తప్పారన్నారు. ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్ కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.