హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా తెరాస ఎంపీ కుమార్తె!
హైదరాబాద్ నగర మేయర్ అభ్యర్థిగా తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు తెరపైకి వచ్చింది. అలాగే, ఈమెతో పాటు.. మరో మహిళా నేత మోతె శ్రీలత పేరు కూడా ఉంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్ల సమావేశం గురువారం జరుగనుంది. అలాగే, ఈరోజు మధ్యాహ్నం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరుగనుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి పోటీపడే అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించి సీల్డ్ కవర్‌లో దానిని మంత్రులకు అందించారు.
కేసీఆర్ ఎంపిక చేసిన వారిలో టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె గద్వాల విజయ లక్ష్మి, మోతె శ్రీలత ఉన్నట్టు సమాచారం. విజయలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా, శ్రీలతను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గత ఎన్నికల సమయంలోనే ఆమె మేయర్ పీఠం కోసం కూడా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈసారి మాత్రం ఆమెకు పక్కా అని చెబుతున్నారు. శ్రీలత తార్నాక నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
మరోవైపు, ఇప్పటికే మంత్రులు తలసాని, మహ్మద్ అలీ, ఎంపీ సంతోష్ కుమార్ సహా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి వారు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళతారు.