బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (17:30 IST)

చెత్త వాగుడు వాగితే పీకిపడేస్తా.. సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానం : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెత్త వాగుడు వాగితే పీకిపడేస్తానంటూ హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన నాకు ముఖ్యమంత్రి పదవి ఓ లెక్కనా.. నా ఎడమకాలి చెప్పుతో సమానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి మార్పు తథ్యమంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం జరిగిన ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో చెత్తవాగుడు వాగుతున్న ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన పేరు ముందు సీఎం పదవి ఓ లెక్కనా? అది నా ఎడమ కాలి చెప్పుతో సమానం. సీఎం పదవి లేకపోయినా.. తెలంగాణ తెచ్చినందుకు గాంధీ ఫొటో పక్కన నా ఫొటో పెట్టి పూజలు చేసేవాళ్లు. ఇప్పుడు పదవిలో ఉన్నోడు.. లేనోడు ఏది పడితే అది మాట్లాడుతున్నడు. 

ఇన్ని అవమానాలు, బాధలు భరించాల్సిన అక్కర నాకేం ఉంది? తెచ్చిన తెలంగాణ ఆగం కావద్దని, రాష్ట్రాన్ని ఎవరికో అప్పగిస్తే అది ఎటో పోతుందని, అనుకున్నది చేస్తరో చేయరోనని.. బాగు చేద్దామని సీఎం పదవిలో కూర్చున్న. తప్పుడు కామెంట్లు చేసేటోణ్ని ఎవరినీ వదిలిపెట్టేది లేదు అని కేసీఆర్ గట్టిగా హెచ్చరించారు. 

అంతేకాకుండా, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేనే సుప్రీం. అక్కడ మంత్రులు, ఇతరులు ఎవరూ వేలు పెట్టొద్దు. కానీ, దీనిని అలుసుగా తీసుకొని కొందరు ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలు పోతున్నారు. పద్ధతి మార్చుకోకపోతే అలాంటి వాళ్లను పీకి పారేస్తా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తే, మళ్లీ వాళ్లకు పార్టీ టికెట్లు వస్తాయి. చెప్పినట్టు వినకపోతే పక్కకు తప్పించడం ఖాయం అంటూ హెచ్చరించారు. 

కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని,  ఇకపై ఎవరైనా లూజ్‌ టాక్‌ చేస్తే బండకేసి కొట్టి.. పార్టీ నుంచి బయటకు పారేస్తానని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ‘‘బాధ్యత లేకుండా మాట్లాడిన వాళ్లు ప్రజల్లో చులకన అవుతారు. వారితోపాటు పార్టీకి కూడా నష్టం కలుగుతుందని గుర్తించాలి. ఎవరైనా గీత దాటితే సస్పెన్షన్‌ వేటు వేస్తాం’’ కేసీఆర్‌ స్పష్టం చేశారు.