కోదండరామ్ కనీసం సర్పంచ్ అయ్యాడా? రాజకీయాల్లోకి వచ్చేయాలి : కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరుల స్ఫూర్తి యాత్ర అని రాజకీయం చేశాడని, ఓట్ల రాజకీయం కావాలంటే కోదండరామ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలన్నారు
తెలంగాణ సీఎం కేసీఆర్ టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరుల స్ఫూర్తి యాత్ర అని రాజకీయం చేశాడని, ఓట్ల రాజకీయం కావాలంటే కోదండరామ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలన్నారు. ఇలాంటి రాజకీయాలు చేయకూడదన్నారు. సింగరేణి ఫలితాలు చూసైనా మారాలని.. 2019లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందన్నారు.
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కోదండరాం ఇన్నేళ్లలో కనీసం సర్పంచ్ అయినా అయ్యాడా? అని ప్రశ్నించారు. కోదండరామ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తెరాస పార్టీ అధికారంలో వున్నంత కాలం ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. కాంగ్రెస్ పాలనలోనే చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగాయని, తాము సమర్థవంతంగా పాలిస్తున్నామన్నారు.
కోదండరామ్ జెండా, అజెండా ఏంటని.. తనపై ఆరోపణలు చేయడమే కోదండరామ్ ఎజెండానా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చింది నిజం కాదా? అబద్ధమా? అని అన్నారు. కోదండరామ్‌ది విషపూరిత మనస్తత్వమని, ఆయన తెరాస వ్యతిరేకి అని కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.