సీఎం కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి: లక్ష్మణ్
ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు మూడు సార్లు గడువు విధించినా... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరినా కార్మికులు విధుల్లో చేరకుండా నైతిక విజయం సాధించారని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు మూడు సార్లు గడువు విధించినా... మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బతిమిలాడినా.... 3 వందలకు మించి ఉద్యోగులు విధుల్లో చేరలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ బెదిరింపులను తిరస్కరించి కార్మికులు ఒక్క శాతం కూడా విధుల్లో చేరకుండా నైతికంగా విజయం సాధించారన్నారు.
సుమారు 48 వేల మంది కార్మికుల తిరస్కరణకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్తోపాటు భవిష్యత్ పోరాటాల్లోనూ భాజపా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మె అంశాన్ని నడ్డా, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. కేసీఆర్కు ఆర్టీసీ అస్తుల మీద ఉన్న ప్రేమ కార్మికుల మీద లేదన్నారు. 2018 నూతన మోటార్ వాహనాల చట్టాన్ని కేంద్రం ప్రవేశ పెట్టిందని... అందుకు అనుగుణంగా ప్రైవేటీకరణ చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు.
ప్రైవేటీకరిస్తే కార్మికుల శవాలపై బస్సులు నడపాలి: నారాయణ
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాల ప్రజలు అండగా ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. సీఎం కేసీఆర్ డెడ్లైన్ పెట్టినా... 360 మందే చేరారని అన్నారు. కాచిగూడ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన నిరసన కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ డెడ్లైన్ పెట్టినా.. బెదిరించినా 360 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చేరిన వాళ్లలో డ్రైవర్లు, కండక్టర్లు లేనేలేరన్నారు. కాచిగూడ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే కార్మికుల శవాలపైన మాత్రమే ప్రైవేట్ బస్సులు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను నడిపితే కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటారని... అవసరమైతే తగులబెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఐకాస నేతలను ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.