ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:42 IST)

జగ్గారెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ - రంగంలోకి ఠాకూర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాకూర్‌ ఆరా తీశారు. అలాగే, శనివారం సాయంత్రం ఇదే అంశంపై గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కూడా నిర్వహించనున్నారు. 
 
ఇందులో జగ్గారెడ్డి కామెంట్లపై సీరియస్‌గా చర్చించాలని రాష్ట్ర నేతలను మాణిక్యం ఠాకూర్‌ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో ఠాకూర్‌ వివరాలు తెప్పించుకున్నారు. అదేసమయంలో ఠాకూర్ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ రానున్నారు. 
 
కాగా, రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని వెళ్లగక్కిన జగ్గారెడ్డి.. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటన ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా ఒకరి నెత్తిన మరొకరు చేయి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీనా లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రచారం కంటే వ్యక్తిగత ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కూడా పార్టీలో గౌరవం లేకుండా పోయిందంటూ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తాను ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నానని.. అలాంటి తనకు గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 
 
సోనియా, రాహుల్ గాంధీ మీద ఉన్న గౌరవం, విలువలతోనే పార్టీలో కొనసాగుతున్నానని.. రాజకీయాల్లో హీరోయిజం పని చేయదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తనకూ అభిమానులు ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా రెండు లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది.. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. మరి.. ఇవాళ్టి సమావేశంలో ఎలాంటి చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆ వెంటనే మాణిక్య ఠాగూర్‌ను రంగంలోకి దించింది.