మాస్కులు పెట్టుకోలేదని పోలీసుల కేసు... కోర్టులో హాజరు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో రాష్ట్రంలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఇక కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మాస్కుల వినియోగం తప్పనిసరి జీఓ జారీ చేసింది. మాస్కులు ధరించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
అలాగే, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా కనిపిస్తే రూ.200 నుంచి రూ.500 వరకు అపరాధం విధిస్తున్నారు. ఈ క్రమంలో కమాన్‌పూర్ మండలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని బుధవారం మంథని కోర్టులో హాజరుపరచనున్నారు.
ఎవరైనా మాస్క్ ధరించకుండా బయటకు వస్తే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా విధించడం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్న విషయం తెల్సిందే. పెద్దపల్లి జిల్లాలోనేకాక తెలంగాణలో ఒకేసారి 11 మందిపై కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఇక తెలంగాణలో కాక ఏపీలో కూడా మాస్కులు ధరించని వారి మీద పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాద్‌లో వాహనదారులకు మాస్కులపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన కల్పిస్తున్నారు.
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ప్రజలంతా ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్నారు. గుంపులు గుంపులుగా చేరవద్దని, మాస్క్ ఖచ్చితంగా ధరించాలని మాస్క్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల పాటు పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.