సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (15:07 IST)

అపోలోకు ఈటల రాజేందర్ తరలింపు : నిలకడగా ఆరోగ్యం

తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో బీజేపీ శ్రేణులు, అభిమానులు పూజలు నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల వ్యాప్తంగా పూజలు, అర్చనలు చేశారు. 
 
అయితే తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దని.... అతి త్వరలోనే ప్రజాదీవెన యాత్రతో వస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని... వైద్య పరీక్షల తరువాత పూర్తి సమాచారం అందిస్తామని ఈటల కుటుంబసభ్యులు తెలియజేశారు. 
 
మరోవైపు, ఈటల రాజేందర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఈటలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, వివేక్‌ పరామర్శించారు. 
 
కాగా హుజురాబాద్‌ ఉప ఎన్నికల నేపత్యంలో వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. ఆరోగ్య రీత్యా పాదయాత్రను నిలిపివేయాలని ఈటలను వైద్యులు కోరారు. 
 
అయితే ఈటల మాత్రం పాదయాత్ర కొనసాగిస్తామన్నారని తెలిపారు. ఈటల కష్టపడి పాదయాత్ర చేస్తుంటే.. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి అక్రమ పద్ధతిలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని సంజయ్‌ మండి పడ్డారు. బండి సంజయ్ వెంట జి.వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు.