శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (13:47 IST)

దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమం : సీఎం కేసీఆర్

దళితబంధు కేవలం ఒక పథకం కాదనీ ఓ ఉద్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందువల్ల హుజూరాబాద్లో దళితబంధు పథకం విజయవంతం చేయాలని సూచించారు. 
 
హుజూరాబాద్ నియోజకవర్గ ఎస్సీ ప్రతినిధులతో సోమవారం సమావేశమైన సీఎం కేసీఆర్, ఈ పథకం లక్ష్యాలు, అమలు, కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ పథకం అమలు ప్రభావం యావత్ తెలంగాణపై ఆధారపడి ఉంటుందన్నారు. పథకం విజయవంతానికి అందరూ దృఢ నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమం ఒక్కడితో ప్రారంభమైందన్న సీఎం.. భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామన్నారు. 
 
నమ్మిన ధర్మానికి కట్టుబడి కొనసాగితేనే విజయం సాధ్యమన్నారు. మనిషిని మనిషి వివక్ష చూపే దుస్థితిపై అధ్యయనం చేశానన్న కేసీఆర్.. మనలో పరస్పర విశ్వాసం, సహకారం పెరగాలని సూచించారు. పరస్పర సౌభ్రాతృత్వం పెంచుకుంటేనే విజయానికి బాటలు వేయొచ్చని హితవు పలికారు. 
 
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల చొప్పున మొత్తం 412 మంది ఎస్సీ పురుషులు, మహిళలు సదస్సులో పాల్గొన్నారు. వీరితోపాటు మరో 15 మంది రిసోర్స్‌పర్సన్లు ఇలా.. మొత్తం 427 మంది ప్రగతిభవన్‌కు చేరుకుని ఈ సమీక్షలో పాల్గొన్నారు.