కింది స్థాయి ఖాళీల భర్తీకి కలెక్టర్లకే అధికారం : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కలెక్టర్లకు మరో అధికారం ఇచ్చింది. ఇక నుంచి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కింది స్థాయిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కలెక్టర్లే భర్తీ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు.
చివరి కేడర్‌లో ఉండే ఉద్యోగులు, ప్రజారోగ్య కార్మికులుకాకుండా ఇతర కార్మికులు, సమానమైన కేడర్‌లోని వారిని నియమించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించింది. ఇప్పటివరకు ఆ పోస్టులను రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసేవారు.
అయితే దానికి సమయం ఎక్కువ పడుతోంది. ఎక్కువ కాలంపాటు పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఉద్యోగాలు భర్తీ చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పురపాలక చట్టం-2019 ప్రకారం అధికారాన్ని బదలాయిస్తున్నట్లు అందులో తెలిపారు.
పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో (జీహెచ్‌ఎంసీ మినహా) ఖాళీలు ఏర్పడినపుడు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి ద్వారా పోస్టులను నోటిఫై చేసి ఎంపిక ప్రక్రియను చేపట్టి నియమించాలని ఆదేశించారు.