శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 జూన్ 2022 (18:27 IST)

తెలంగాణ అసెంబ్లీలో 20 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు అడుగుపెడతారు: కేఏ పాల్ జోస్యం

ka paul
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాదని ప్రత్యేక తెలంగాణ కోసమే తెలంగాణ ప్రజానీకం ఉద్యమించి తమ ప్రాణాలను సైతం ఆత్మార్పణ చేసిన వీరులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె ఏ పాల్ మండిపడ్డారు. శుక్రవారం ప్రజాశాంతి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ తెలంగాణ ప్రజలకే దక్కుతాయని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి వారి ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నేడు అమరవీరుల కుటుంబాలను అన్ని రకాలుగా నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ వచ్చి, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ పన్నెండు వందల మంది అమరవీరులను ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. 

 
నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కెసిఆర్ పిలవకపోవడం తెలంగాణ ప్రజల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుందని మండిపడ్డారు. కెసిఆర్‌తో పాటుగా కాంగ్రెస్-బిజెపి చేయలేని పనిని తాను చేసి చూపిస్తానన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రాబోయే ఎన్నికల్లో 20 సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

 
అమరవీరుల కుటుంబాలకు విద్య, వైద్యంతో పాటుగా వసతి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ కెసిఆర్ కుటుంబానిది కాదు, కాంగ్రెస్ సోనియమ్మది కాదు, ఆర్ఎస్ఎస్, బిజెపిది కాదని ఈ రాష్ట్రం తెలంగాణ అమరవీరులది అని ఉద్ఘాటించారు. దళితుల, బడుగు బలహీనర్గాల, తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ సీఎంగా కాదు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవడని జోస్యం చెప్పారు. 

 
తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల రాష్ట్రంగా చేస్తూ ఆడుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అదే పని చేస్తున్నారని, దేశంలో మోడీ సైతం అదే చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో పత్రికా యాజమాన్యాలకు కెసిఆర్ అందగాడిలా మారాడని, ఏ పేపర్లో చూసినా కెసిఆర్ ప్రకటన ఫోటోలే కనిపిస్తున్నాయన్నారు. ఇక్కడ తెలంగాణ అమరవీరుల కుటుంబాల సమస్యలు పట్టించుకోవడంలో విఫలం అయ్యాయని విమర్శించారు.

 
అనంతరం అమరుడు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల కుటుంబాలకు తగిన గుర్తింపు ఇచ్చి ఆదుకోవడంలో కెసిఆర్ పూర్తిగా విఫలం చెందారని, ఎనిమిది ఏళ్ల పాలనలో నీవు, నీ కుటుంబం బాగుపడింది తప్ప  మా కుటుంబాలకు ఏం చేసావ్ అని ప్రశ్నించారు. 

 
శంకరమ్మకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి ఓడించారని, అనంతరం ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఇన్నాళ్లు మభ్య పెట్టారని విమర్శించారు.  నేను ప్రజాశాంతి పార్టీలో చేరినందుకు నా భార్య శంకరమ్మతో ఫోన్లు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. తక్షణమే ఇటువంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. ఈ తెలంగాణ అమరవీరులకు, ప్రజలకు కేఏ పాల్ గారు దేవుడిలా వచ్చాడని, రాబోయే రోజుల్లో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తామని తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో డాక్టర్ సిహెచ్ భద్ర, తెలంగాణ అమరవీరుడు బీరెల్లి రాములు సోదరులు సమ్మయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.