ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శుక్రవారం, 4 జూన్ 2021 (23:49 IST)

కుటుంబం ఆత్మహత్య!

కీసర: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్‌కు చెందిన భిక్షపతి, ఉష దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కీసర పరిధిలోని నాగారం-వెస్ట్‌ గాంధీనగర్‌ వచ్చారు. భిక్షపతి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.

వీరికి కుమార్తె హర్షిణి, కుమారుడు యశ్వంత్‌ ఉన్నారు. పక్కనే ఓ ఇంట్లో ఉన్న ఓ బాలిక పట్ల భిక్షపతి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. ఈక్రమంలో గురువారం రాత్రి అతడిపై దాడి చేశారు. అనంతరం శుక్రవారం ఉదయం పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి వెళ్లిపోయారు.

అవమానం భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి.. తొలుత తన భార్య, పిల్లలకు ఉరివేసి అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.