1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (07:03 IST)

నేడు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ

fish prasadam
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప మందు పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రోగులు ఇక్కడకు తరలిరావడంతో అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మందు పంపిణీ, నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావించి రేయింబవుళ్లూ ఏర్పాట్లు చేసింది. ఈ చేప ప్రసాదం పంపిణీకి 34 కౌంటర్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం 7 గంటలకు ఈ చేప మందు పంపిణీని ప్రారంభింస్తారు. 
 
ప్రజల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. మైదానం లోపల, గేట్లు, కౌంటర్ల వద్ద 70 సీసీ కెమెరాలను బిగించారు. లోపల కంట్రోల్ రూమ్ నుంచి ప్రజల కదలికలను మానిటరింగ్ చేయనున్నారు. ఈ మేరకు మంత్రి తలసాని సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసారి మాత్రం జనానికి ఇక్కట్లు, అపశ్రుతి వంటి సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికా రులను మంత్రి ఆదేశించారు.
 
ప్రజలకు నీటి దాహార్తిని తీర్చేందుకు జలమండలి ఉచితంగా స్వచ్ఛమైన నీటి ప్యాకెట్లను అందించ రోగులు, సహాయకులకు అన్నదానం అందించనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కొనసాగుతున్నాయి. ఈ దఫా మెట్రోరైలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజల భద్రతకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండా 24 గంటల పాటు పోలీసులు తమ విధులు నిర్వ హించనున్నారు. అలాగే ట్రాఫిక్ వర్గాలు వారి సేవలో గడపనున్నారు. 
 
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేప ప్రసాదం కోసం లక్షల మంది రావడంతో వారి దాహార్తిని తీర్చేందుకు ఉచిత మినరల్ వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. ఉత్తరాది సంస్థలు రోగులకు, వారి సహాయకులకు ఆహరం, ఫలహారాలు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పూరీలు, ఇడ్లీలు, పులిహోరాలను పంపిణీ చేయనున్నాయి.