బల్దియా పోరు ఫలితాల్లో ట్విస్ట్ : కాషాయం రెపరెపలు.. కారుకు పంక్చర్?
గల్లీ నుంచి ఢిల్లీ వరకు అమితాసక్తితో ఎదురు చూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభంలో అధికార తెరాసకు తేరుకోలని షాక్ కొట్టింది. ప్రారంభంలో 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది.
తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. తక్కువగా ఓట్లు పోలైన మెహిదీపట్నంలో మొదటి రౌండ్‌లోనే ఫలితం తేలనుంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపును బట్టి బీజేపీ 23 డివిజన్లలో ఆధిక్యంలో ఉండగా, అధికార తెరాస కేవలం 6 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఇతర పార్టీలు ఇంకా ఖాతా తెరవలేదు.
కాగా, ఈ నెల ఒకటో తేదీన 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 34,50,331 ఓట్లు పోలయ్యాయి. 1,926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు జారీ చేశారు. మొదటి రౌండ్‌గా వీటిని తెరిచారు. డివిజన్ల వారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలను ప్రకటిస్తున్నారు.
ఇదిలావుంటే, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో, బ్యాలెట్ పేపర్‌పై పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్టేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించలేదని ఆరోపిస్తూ, బీజేపీ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
శుక్రవారం ఉదయం హైకోర్టు తెరచుకోగానే దీనిపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈసీ తాజా నిర్ణయం తరువాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లపై తమకు అనుమానాలు పెరుగుతున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు.