1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (16:38 IST)

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్- 35 కనీస మార్కులు వేసి పాస్ చేస్తారా?

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా లాంటి కాలంలో జరిగిన పరీక్షల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంపై దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇప్పుడు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది.
 
ఈ నేపథ్యంలో.. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థి సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో.. విద్యార్థులు అందరినీ పాస్‌ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
 
ఫెయిల్‌ అయిన విద్యార్థులకు.. 35 కనీస మార్కులు వేసే విషయాన్ని పరిశీలిస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫెయిల్‌ విద్యార్థుల్లో ఎక్కువ మంది 5నుంచి 10 శాతం మార్కులు మాత్రమే సాధించారు. 
 
ఆన్‌లైన్‌ క్లాస్‌ ద్వారా విద్యార్థులకు సరైన బోధన జరగకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులు అందరినీ ఇంటర్‌కు ప్రమోట్‌ చేయడం మరో కారణం అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 
దీంతో ప్రస్తుతం ఫెయిల్‌ అయిన విద్యార్థులు అందరినీ.. కనీస మార్కులతో పాస్‌ చేయడం తప్ప.. మరో మార్గం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.