తెలంగాణలో బార్లు, పబ్బులకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ బార్ బాబులకు గుడ్ న్యూస్. త్వరలో తెలంగాణలో బార్లు, పబ్బులు తెరుచుకోనున్నాయి. ఈ నెల 8 నుంచే వీటిని తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కరోనా కారణంగా లాక్‌డౌన్‌కు ముందే రాష్ట్రంలోని 1000కి పైగా బార్లు, పబ్బులు, క్లబ్బులు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనున్న లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో వీటికీ అనుమతి లభించనుందని తెలిసింది. 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకోనున్నాయి.
అందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. సాధారణంగా ప్రతి బార్‌కు రెస్టారెంట్ సౌకర్యం ఉంటుంది. మద్యంతో పాటే ఫుడ్ సర్వింగ్ ఉంటుంది.
ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. బార్లు, పబ్బులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే వీటికి కూడా 8 నుంచి అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించిందని సమాచారం.
రెస్టారెంట్లలో నిబంధనలనే బార్లలో పాటిస్తే పెద్దగా సమస్య ఉండదని ఆ శాఖ భావిస్తోంది.