ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి

gutta sukhender reddy
ఎం| Last Updated: గురువారం, 8 ఆగస్టు 2019 (07:59 IST)
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కోటాలో 2015లో టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్సీగా కె.యాదవరెడ్డి ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానానికి 2021 జూన్ 3 వరకు పదవీకాలం ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది.

ఇకపోతే ఉపఎన్నిక అనివార్యం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 1న షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనెల 7 నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరణ, 16న నామినేషన్ల పరిశీలన, 19న ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటిస్తారు. ఏకగ్రీవం కాకుంటే 26న ఎన్నిక నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ఓట్లను లెక్కిస్తారు.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలాబలాలను పరిశీలిస్తే ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం ఖాయమని స్పష్టమవుతోంది. అంతేకాదు కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ కూడా కన్ఫమ్ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇకపోతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రరైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.దీనిపై మరింత చదవండి :