1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:34 IST)

హుజురాబాద్ బైపోల్ వాయిదా : ఈసీ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే, ఏపీలోని కర్నూలు జిల్లా బద్వేల్ శాసనసభ స్థాన ఉప ఎన్నికను కూడా వాయిదావేసింది. 
 
తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో గెలుపును అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. 
 
ఈ ఎన్నికలో గెలుపొంది తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలపై తిరుగులేని ఆధిపత్యం సాధించాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
హుజూరాబాద్ ఉపఎన్నికను వాయిదా వేసింది. దీంతోపాటు, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ శాసనసభ నియోజకవర్గానికి జరగాల్సిన ఉపఎన్నికను సైతం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
 
బెంగాల్‌లోని భవానీ పూర్, షంషేర్ గంజ్, జాంగీపూర్, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గాలు మినహా... ఉపఎన్నికలు జరగాల్సిన మిగిలిన 31 నియోజకవర్గాల ఉపఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. 
 
వీటితో పాటు మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు జరగాల్సిన ఉపఎన్నికలను కూడా వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. కరోనా నేపథ్యంలోనే ఎన్నికలను వాయిదా వేస్తున్నామని ఈసీ తెలిపింది.