మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (14:54 IST)

23 నుంచి హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌

ఈ నెల 23నుంచి హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ప్రారంభం కానుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో పాటూ కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ప్రచురణ సంస్థలు పాల్గొననున్నట్లు సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ కమిటీ బాధ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గౌరీశంకర్‌ మాట్లాడుతూ సాహిత్యాభిరుచి కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న సహకారం వల్లనే దేశవ్యాప్తంగా ఢిల్లీ, కోల్‌కతా, రాజస్థాన్‌ బుక్‌ఫెయిర్‌ల తర్వాత హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించిందన్నారు.

గత ఐదేళ్లుగా పుస్తక మహోత్సవానికి ఎన్టీఆర్‌ గ్రౌండ్‌ (తెలంగాణ కళాభారతి)ను ప్రభుత్వం ఉచితంగా కేటాయిస్తోందని చెప్పారు. యువతలో సాహిత్య జిజ్ఞాసను పెంపొందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సొసైటీ రొట్టమాకురేవు వంటి మారుమూల పల్లెల్లోనూ పుస్తకాల పండగ నిర్వహణను తలపెట్టిందని పేర్కొన్నారు.

సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ మాట్లాడుతూ పిల్లలకోసం ప్రత్యేకంగా ‘‘బాలమేళ’’ నిర్వహించనున్నట్లు చెప్పారు. వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖల సహకారంతో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ జ్ఞాన తెలంగాణ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తోందని కొనియాడారు.