గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (08:08 IST)

భాగ్యనగరిలో తాగునీటి సరఫరా బంద్.. ఎందుకు.. ఎక్కడ?

హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరాను నిలిపివేయనున్నారు. భాగ్యనగరికి తాగునీటి సరఫరాలో కీలకమైన కృష్ణా ఫేజ్‌ -1 పంప్‌హౌజ్‌లో మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 16, 17 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాలకు 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ఎండీ ఎం. దానకిశోర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
 
కోదండాపూర్‌, నాసర్లపల్లి, గొడకండ్ల పంప్‌హౌజ్‌లో 600 ఎంఎం పైపులైన్‌పై వాల్వులు అమర్చడం, 300 ఎంఎం డయా పైపులైన్‌ లీకేజీలను అరికట్టేందుకు ఈ మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. 
 
ఈ నెల 16వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ కోరారు.
 
కాగా, నీటి సరఫరా నిలిపివేయనున్న ప్రాంతాలను పరిశీలిస్తే... మిరాలం, కిషన్‌బాగ్‌, బాల్‌షెట్టికేత్‌, అల్‌జుబేర్‌కాలనీ, అలియాబాద్‌, హషమాబాద్‌, రియాసత్‌నగర్‌, సంతోష్‌నగర్‌, వినయ్‌నగర్‌, సైదాబాద్‌, ఆస్మాన్‌ఘడ్‌, దిల్‌షుక్‌నగర్‌, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మెహబూబ్‌ మాన్షన్‌, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్‌, హిందీనగర్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివంరోడ్‌, చిలకలగూడ ప్రాంతాలు ఉన్నాయి.