గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. ఏంటది? ఆధార్ తప్పనిసరి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరవాసులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉచిత తాగునీటి పథకానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 
 
డిసెంబర్ నుంచి గ్రేటర్ వాసులకు ఉచిత తాగునీరు అందజేస్తామని కేసీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గృహ అవసరాలకు నెలకు 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక, ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలో డిసెంబర్ చివరి నుంచి కానీ, వచ్చే నెలలో కానీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాగునీటి కనెక్షన్‌కు ఆధార్ తప్పనిసరి చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేరిట డిసెంబర్ 2వ తేదీన జీవో విడుదలైంది. 
 
ఉచిత తాగునీరు పొందాలనుకునేవారికి ఆధార్ లేకుంటే.. వెంటనే అప్లై చేసి, ఆ రశీదును అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అలస్యమైతే పోస్టాఫీసు పాస్‌బుక్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీలలో ఒకటి సమర్పించాలి. అయితే ఈ నిబంధన కొత్తగా కనెక్షన్ తీసుకున్నవారికా?, ప్రస్తుతం ఉన్న కనెక్షన్ దారులందరికా? అనే విషయంపై జీవోలో స్పష్టత ఇవ్వలేదు.