కస్టడీలో టోనీ.. విచారణలో షాకింగ్ నిజాలు.. మహిళలు, కొరియర్ ద్వారా?
డ్రగ్స్ కేసులో నైజిరియాకు చెందిన టోనీని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టులు టోనీకి రిమాండ్ విధించింది. టోనీ రెండో రోజు కస్టడి విచారణలో పలు కీలక విషయాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు రాబట్టారు.
టోనికి హైదరాబాదులోని వ్యాపారులతో సంబంధం ఎలా ఏర్పడిందనే వివరాలను పోలీసులు సేకరించారు. వ్యాపారవేత్త శాశ్విత్ జైన్ ద్వారా హైదరాబాద్‌లో ఉన్న వ్యాపారులను టోనీ పరిచయం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌కు డ్రగ్స్ పంపించమని శాశ్విత్ జైన్ టోనీని కోరాడు. తనతో పాటు చాలామంది వ్యాపారవేత్తలు డ్రగ్స్ కొనుగోలు చేస్తారంటూ టోనీకి శాశ్విత్ జైన్ పరిచయం చేసాడు. కొంతమంది వ్యాపారవేత్తలు ముంబైలో టోనీ నేరుగా కలిసినట్టు పోలీసుల విచారణలో చెప్పాడు.
ప్రస్తుతం శాశ్విత్ జైన్ చంచల్ గూడ జైల్‌లో ఉన్నాడు. అరెస్టయిన ఏడు మందిలో A11 గా ఉన్న శాశ్విత్ జైన్ కన్స్‌స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాడు. ఇకపోతే టోనీ తన ఖాతాదారులకు కొకైన్ సరఫరా చేయడానికి మహిళలతో సహా కొరియర్‌ల నెట్‌వర్క్‌ను ఉపయోగించాడు.
ముంబైకి చెందిన ఓ మహిళ టోనీకి కొన్ని సందర్భాల్లో ఏజెంట్‌గా పనిచేసి కస్టమర్లకు డ్రగ్‌ను సరఫరా చేసింది. టోనీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ మరియు కాల్ వివరాలను తనిఖీ చేసిన పోలీసులు అతను తన ఏజెంట్లతో కమ్యూనికేట్ చేయడానికి నైజీరియన్ సిమ్ కార్డ్‌తో సహా రెండు మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
ఎయిర్‌పోర్టుల్లో భద్రతా తనిఖీల్లో పట్టుబడతామనే భయంతో ఏజెంట్లు ప్రైవేట్ కార్లు లేదా బస్సుల్లో ప్రయాణించారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే, కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపేవారని దర్యాప్తును పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారి తెలిపారు.
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో టోనీతో పాటు మరో ఏడుగురు వ్యాపారవేత్తలను హైదరాబాద్ పోలీసులు ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేశారు. టోనీ ఏజెంట్లతో లావాదేవీలు జరిపిన మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
టోనీతో పాటు అరెస్టయిన ఏడుగురు వ్యాపారవేత్తలు అతనితో ఎలా పరిచయమయ్యారు, డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని పోలీసులు విచారణ చేస్తున్నారు.