1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (15:14 IST)

తెలంగాణాలో కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా 8 నుంచి 9 డిగ్రీల మేరకు ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి)లో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు చలికి అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణాలో శీతల గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. 
 
కాగా, జనవరి నెలాఖరులో కూడా ఇంతటి కనిష్ట స్థాయిలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి శీతల గాలులు తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు వీస్తుండటం వల్లే చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.