శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (13:36 IST)

పట్టాలెక్కిన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు.. స్మార్ట్ కార్డులపై డిస్కౌంట్

గత 15 నెలలుగా సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వే వర్క్‌షాప్ కే పరిమితమైన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు నేటి నుంచి పట్టాలెక్కాయి. గతంలో 121 సర్వీసులు తిరుగుతుండగా బుధవారం నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
 
ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య ఇరువైపులా మూడు చొప్పున మొత్తం 6, హైదరాబాద్‌- లింగంపల్లి మధ్య కూడా ఇరువైపులా రెండేసి చొప్పున మొత్తం 4 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తాయి. ఉదయం 7.50 నుంచి రాత్రి 7.05 గంటల వరకు రైళ్లు తిరుగుతాయి.
 
గతేడాది మార్చి 22 నుంచి ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నిలిచిపోయాయి. అప్పడు సీజన్ టికెట్లు తీసుకున్నవారు వాటిని పూర్తి కాలం వినియోగించుకోలేక పోయారు. అలాంటి వారు జూన్23వ తేదీ నుంచి మిగిలిన రోజులు ఎన్ని ఉంటే అన్ని రోజుల వరకు పాత టికెట్లను వినియోగించుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లలో గడువు పెంచుకోవచ్చని అన్నారు.
 
కరోనా నేపధ్యంలో స్టేషన్లలో నగదుతోపాటు స్మార్ట్ కార్డులున్నవారు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చని… ఇలా తీసుకుంటే టికెట్ పై 3 శాతం డిస్కౌంట్ లభిస్తుందని చెప్పారు. యూటీఎస్ యాప్ (అన్‌ రిజర్వుడు టిక్కెటింగ్‌ సిస్టం) ద్వారా పేపర్ లెస్ టికెట్ పొందేవారికి 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య వివరించారు.