నా కొడుక్కే చలానా రాస్తారా? ఠాణాలకు కరెంట్ సరఫరా నిలిపివేత.. ఎక్కడ?
మైనర్ బాలుడు ద్విచక్రవాహనాన్ని నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు చలానా రాశారు. ఈ విషయం ఆ మైనర్ బాలుడి తండ్రికి తెలిసింది. అంతే.. ఆయన ఒంటికాలిపై ట్రాఫిక్ పోలీసులపై నోరుపారేసుకున్నాడు. అంతటితో సరిపెట్టుకున్నారంటే అదీలేదు.. ఏకంగా రెండు పోలీస్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటన జీడిమెట్లలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్‌ఐ రమేష్ విధి నిర్వహణలో భాగంగా మంగళవారం సాయంత్రం షాపూర్‌నగర్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై అటుగా వచ్చిన మైనర్ ద్విచక్ర వాహనాన్ని ఆపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని బాలుడిని పంపించారు.
అయితే, ఈ బాలుడు తండ్రి జీడిమెట్ల విద్యుత్ శాఖలో కాంట్రాక్టు కార్మికుడు (ఆర్టీజెన్)గా పని చేస్తున్నాడు. ఆ బాలుడు నేరుగా జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పారు. ఆయన తన పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో... బాలుడు తండ్రి తమ శాఖలో పని చేస్తున్నారనీ, బండిని వదిలేయాలని ఫోన్లో అధికారులను కోరాడు.
ఈ విషయంలో తామేమీ చేయలేమని, చలాన్ కూడా రాశామని చెప్పడంతో ఆర్టీజెన్ కోపంతో ఊగిపోయాడు. 'మాకు సాయం చేయరా.. మీ సంగతి చెప్తా' అంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండానే మంగళవారం సాయంత్రం ఆరు దాటాక ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, గాజులరామారం కార్యాలయాల విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు.
రెండు గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లు అంధకారంలో ఉన్నాయి. జీడిమెట్ల సీఐ బాలరాజు విద్యుత్ డీఈ రాజుతో మాట్లాడి విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకున్నారు.