శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (16:31 IST)

ఇంటి బయటికి వచ్చి కుటుంబంతో సహా చప్పట్లు కొడతా: కేసీఆర్

‘‘ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుపై సోషల్ మీడియాలో కొందరు హేళన చేస్తున్నారు. సాయంత్రం బయటికి వచ్చి చప్పట్లు కొడితే తప్పేంది. దేశ ఐక్యతను చూపించుకోవడానికి ఇలాంటిది చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా రేపు సాయంత్రం 5 గంటలకు ఇంటి బయటికి వచ్చి నా కుటుంబంతో సహా చప్పట్లు కొడతాను" అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. ప్రధానిపై ట్రోల్స్ చేయడం చాలా దారుణమని, అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి చెబుతున్నానని కేసీఆర్ అన్నారు. కరోనా కట్టడికి ‘జనతా కర్ఫ్యూ’ పేరుతో పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తామని కేసీఆర్ అన్నారు.

ఈ విషయమై రాష్ట్ర డీజీపీకి ప్రెస్‌మీట్‌లోనే ఆదేశాలు జారీ చేశారు. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు అందరూ ఇళ్ల బయటికి వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు. వ్యక్తిగత బాధ్యతతో కరోనా కట్టడీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై నియంత్రణ పెట్టామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, విదేశాల నుంచి వచ్చినవారికి చేతులెత్తి దండం పెడుతున్నానని అన్నారు.

‘‘మీరు మా రాష్ట్రం బిడ్డలే. బయట తిరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. క్వారంటైన్‌ నుంచి ఎందుకు పారిపోవాలి? ప్రజలు ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వ రవాణా సంస్థల్ని నిలిపివేస్తున్నాం. సోమవారం ఉదయం వరకు ప్రజలు ఎవరూ బయటికి రావద్దు’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.