శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (09:21 IST)

ప్రగతి భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు ... అతికొద్ది మంది అతిథులకే ఎంట్రీ!!

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ ఒక్క శుభకార్యం లేదా కీడు కార్యాన్ని కూడా హంగు ఆర్భాటంగా నిర్వహించలేని దయనీయ పరిస్థితి ఏర్పడింది. అలాగే, ఈ నెల 15వ తేదీన జరుగనున్న పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో ఈ యేడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతి నుంచి కేసీఆర్ గోల్కొండ కోటలో జెండాను ఎగరవేసిన అనంతరం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి వేడుకలను అతికొద్ది మంది అతిథులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. 
 
కాగా, జిల్లా స్థాయిలో మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి ఏయే జిల్లాల్లో ఎవరు జెండాను ఆవిష్కరించేదీ పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్ పర్సన్లు, మునిసిపల్ చైర్‌పర్సన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు జిల్లా స్థాయిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. 
 
ఉదయం 9:30 గంటలకు వీరంతా తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. అలాగే, మండల స్థాయిలో ఎంపీపీలు, గ్రామస్థాయిలో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించడంతోపాటు శానిటైజర్లు ఉపయోగించాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.