బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

టీఎస్‌ఆర్టీసీ కార్మికుల బంద్‌కు జనసేనాని మద్దతు

తెలంగాణలోని ఖమ్మం బస్సు డిపోలో ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి ఆత్మబలిదానంపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.

తక్షణం ప్రభుత్వం స్పందించి వారిని చర్చలకు పిలవాలని డిమాండ్​ చేశారు. ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాసరెడ్డి ఆత్మబలిదానం తీవ్రంగా కలచివేస్తోందని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని చింతించారు. ఖమ్మం బస్సు డిపోలో ఆత్మహత్యకు ప్రయత్నంచినప్పుడే ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకుని ఆయనతో మాట్లాడితే ఈ దారుణం జరిగేది కాదని అన్నారు.

తన భార్య, పిల్లల ఎదుటే ఆయన మంటల్లో దహించుకుపోవడం... తలచుకుంటేనే గుండె బరువెక్కుతుందన్నారు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఆయన ఆర్టీసీ కార్మికుల బాగోగుల గురించే ఆలోచించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోరుకున్న తెలంగాణ ఆవిర్భవించిన తరువాత కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం శోచనీయమన్న పవన్​...శ్రీనివాస్​ రెడ్డి కుటుంబానికి ఆయన లోటు తీర్చగలమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించి ఆర్టీసీ కార్మికులలో ధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని కార్మికులందరికీ జనసేనాని విజ్ఞప్తి చేశారు.
 
టీఎస్‌ఆర్టీసీ కార్మికులు బంద్‌కు జనసేనాని పవన్‌కల్యాణ్ మద్దతు ప్రకటించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ మద్దతిస్తోందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యపై జనసేనాని పవన్‌కల్యాణ్ చెలించిపోయారు. ఆర్టీసీ కార్మికులు శ్రీనివాసరెడ్డి, సురేందర్‌గౌడ్ ఆత్మహత్యలు బాధాకరమన్నారు. 
 
ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదని ఆయన సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చిందని చెప్పారు. 48 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఆవేదన కలిగిస్తోందని, సమ్మె జఠిలం కాకుండా సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు పవన్‌కల్యాణ్‌ సూచించారు.
 
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై పవన్ మొదటి నుంచి సానుకూలంగా స్పందిస్తున్నారు. ఉద్యోగులపై ఉదారతను చూపాలని, వాళ్ల సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని కేసీఆర్‌కు పవన్‌ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 
 
సకల జనుల సమ్మెలో పాల్గొనడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఆర్టీసీ ఉద్యోగులు అండగా నిలిచారని, వారు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు. 1200 మంది మినహా వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించినట్టుగా వస్తున్న వార్తలు కలవరానికి గురిచేస్తున్నాయని పవన్ పేర్కొన్నారు.