శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (13:43 IST)

కేసీఆర్‌ మరో గాంధీ: మంత్రి ఎర్రబెల్లి

పల్లెల ప్రగతి కోసం మహాత్మాగాంధీ కన్న కలలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్‌ గ్రామాల సమగ్రాభివృద్ధికి నడుం బిగించారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశంసించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మహాత్ముడి తర్వాత మరో గాంధీగా మారారని కొనియాడారు.

గ్రామాభివృద్దే దేశాభివృద్ధి అని బలంగా నమ్మి గ్రామ స్వరాజ్య స్థాపనకు గాంధీ కలలు కన్నారని, అయితే అప్పటి ప్రభుత్వాలు ఆయన కలలు, ఆదర్శాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ గ్రామాలను ఆదర్శ పల్లెలుగా మార్చడంతో పాటు స్వయం సమృద్ధిని సాధించే దిశలో కేసీఆర్‌ వినూత్నమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల గురించి ఇంతగా ఆలోచించే సీఎంను చూడలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. శాసనమండలిలో పల్లెప్రగతిపై స్వల్ప వ్యవధి చర్చకు ఎర్రబెల్లి సమాధానమిస్తూ.. 150 మంది జనాభా ఉన్న గ్రామాలకు కూడా ప్రభుత్వం ఏడాదికి రూ.5 లక్షల గ్రాంట్‌ను విడుదల చేస్తుందని చెప్పారు.

గ్రామాలు బాగుపడాలనే ధ్యేయంతో నిరంతర కార్యక్రమంగా కొనసాగిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమానికి నిధుల కొరత లేదని అన్నారు.