సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (16:24 IST)

ప్రధానికి అవకాశమిస్తే తెలంగాణ, ఆంధ్రాను కలిపేస్తారు: కేటీఆర్

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధానిగా అవకాశమిస్తే తెలంగాణ, ఆంధ్రాను కలుపుతారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ అడిగితే.. వాట్సాప్​ యూనివర్సిటీలో మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
గిరిజన రిజర్వేషన్లు పెంచమని అడిగి నాలుగేళ్లయినా.. ఇప్పటికి దాని గురించి ప్రస్తావన లేదని వాపోయారు. మోదీ కేవలం ఉత్తర్​ప్రదేశ్, ఉత్తర భారత్​కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు
 
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. సిద్దాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.120 కోట్లతో నిర్మించనున్న రిజర్వాయర్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు స్పీకర్ పోచారం, మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా తెరాస అభివృద్ధి చేస్తోంది. కానీ కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. విషం నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ము కేంద్రానికి ఉందా? నేను సవాల్ చేస్తున్నా.. ఇలా అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న స్థితి మోదీది. 
 
కర్ణాటకకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చిన మోదీ.. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరుకు జాతీయ హోదా అడిగితే ఎందుకు ఇవ్వలేదు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న పార్టీ మనకు అవసరమా మీరంతా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలను అవమానిస్తుంటే ఇక్కడి భాజపా నేతలు ఏం చేస్తున్నారు. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. కేటీఆర్.