శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (12:40 IST)

కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ.. కోర్ట్ చౌరస్తాకు ఆయన పేరు!

దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని మంగళవారం సూర్యాపేట పట్టణంలో ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌ రెడ్డి చేశారు. తెలంగాణకు, సూర్యాపేట గడ్డకు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలా ఏర్పాటు చేశామన్నారు.
 
గత జూన్‌లో లఢక్‌లోని గల్వాలన్‌ లోయలో చైనా ఆర్మీతో జరిగిన పోరాటంలో ప్రాణాలొదిలిన సంతోష్‌ బాబు కుటుంబానికి.. సీఎం కేసీఆర్ కొండంత భరోసాను, ధైర్యాన్ని అందించారని చెప్పారు. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు సూర్యపేట పట్టణంలోని కోర్ట్ చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేశామని, చౌరస్తాను అందంగా సుందరీకరణ చేసినట్లు వెల్లడించారు.
 
ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్‌ సంతోష్‌ బాబు కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించనున్నారు. భారత్‌-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి కర్నల్‌ సంతోష్‌ బాబు అమరుడయ్యారు. 
 
సంతోష్‌బాబు ప్రథమ వర్థంతి సందర్భంగా 9 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఓల్డ్‌ వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డుకు కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.