మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (09:21 IST)

తెలంగాణాలో రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ఈ పెంచిన చార్జీలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. భూముల రిజిస్ట్రేషన్, వినియోగ చార్జీలు, ఆ శాఖ అందించే ఇతర సేవల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఈ పెంచిన చార్జీలు సెప్టెంబరు 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
 
ఈ మేరకు బుధవారం కూడా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.500గా ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీ తాజా పెంపు కారణంగా రూ.2 వేలకు పెరగ్గా, సొసైటీల డాక్యుమెంట్ల ఫైలింగుకు ఉన్న రూ.300 ఫీజును 1000 రూపాయలకు పెంచింది.
 
అగ్రిమెంట్ ఆఫ్ సేల్, జీపీఏలకు గతంలో రూ.2 వేలు ఉండగా దానిని కనిష్ఠంగా రూ.5 వేలు, గరిష్ఠంగా రూ. లక్ష రూపాయలకు పెంచింది. వీటితోపాటు ఇతర చార్జీలను పెంచిన ప్రభుత్వం సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకుంటే రూ.5 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 
 
అలాగే, రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం కుటుంబ సభ్యులంటే ఎవరో కూడా వివరించింది. ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం.. తండ్రి, తల్లి, భర్త, భార్య, సోదరుడు, అక్క, కొడుకు, కుమార్తె, తాత, అవ్వ, మనవలు, దత్తత తీసుకున్న కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రిగా పేర్కొంది.