1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (13:44 IST)

నాటుకోడికి డిమాండ్.. వెయ్యికి దగ్గరలో ధర

బ్రాయిలర్ రాకతో కనుమరుగైన నాటుకోళ్ల పెంపకం రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఊపందుకుంటోంది. రోడ్డుపక్కన అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పూర్వం రోజుల్లో నాటుకోళ్లను అధికంగా పెంచేవారు. 
 
2000 సంవత్సరానికి ముందు గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకం అధికంగా ఉండేది. ఇంట్లో ఖాళీ జాగ ఉంటే నాటుకోళ్లనే పెంచేవారు. ఎవరైనా బంధువులు వస్తే నాటుకోడినే కోసేవారు.
 
గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పండుగలకు గ్రామదేవతల దగ్గర నాటుకోళ్లనే నైవేద్యంగా ఇచ్చేవారు. మార్కెట్లోకి బ్రాయిలర్ ఎంట్రీ ఇవ్వడంతో నాటుకోళ్ల పెంపకం క్రమంగా తగ్గింది. 
 
నాటుకోళ్ల మార్కెట్‌ను బ్రాయిలర్ ఆక్రమించింది. గుడ్డు తక్కువ ధరకు రావడం, మాంసం కూడా మెత్తగా ఉండటంతో మాంసం ప్రియులు బ్రాయిలర్ వైపు మొగ్గు చూపారు. దీంతో నాటుకోళ్ల పెంపకం క్రమంగా తగ్గింది. 
 
బ్రాయిలర్ కోడి త్వరగా బరువు పెరిగేందుకు హార్మోన్లు ఇంజక్షన్లు ఇస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి హానిచేస్తాయని భావన ప్రజల్లో పెరిగింది. దీంతో తమకు దగ్గర్లో నాటుకోళ్లు లేకపోయినా, తెలిసిన వారితో తెప్పించుకుంటున్నారు. 
 
నాటుకోడి మాంసం వినియోగం పెరగడంతో ధర అమాంతం పెరిగింది. కేజీ లైవ్ కోడి రూ.600 పలుకుతుంది. ఇక చికెన్ అయితే రూ.700 పైమాటే.. బోనాల సమయంలో పలు ప్రాంతాల్లో కిలో రూ.800 లకి కూడా అమ్మారు.