నిమజ్జనం సమయంలో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడండి : హైకోర్టు
హైదరాబాద్ నగరంలో వినాయకచవితి ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. అయితే, వినాయక విగ్రహాల నిమజ్జనం సమయం హుస్సేన్ సాగర్‌లో జరుగుతుంది. అయితే, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని ఈ నెల 6న తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని సూచించింది.
కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులు కూడా చూడాలని సూచింది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా హైకోర్టు వ్యక్తం చేసింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలని హైకోర్టు తెలిపింది.