శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 17 జనవరి 2021 (09:52 IST)

సిరిసిల్లా జిల్లాలో చిరుతపులి సంచారం.. భయాందోళనలో జనం

తెలంగాణలో గత కొన్ని రోజులుగా చిరుత పులుల సంచారం ఎక్కువైంది. చిరుత పులులు వనాలు విడిచి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడ సమీపంలో చిరుత సంచరించింది. 
 
మూడు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులో కనిపించిన చిరుత, ఈ రోజు తెల్లవారుజామున వేములవాడ అర్బన్‌ మండలంలోని మారుపాక శివారులో సంచరించింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు పులి అడుగుల గుర్తులు కనిపించాయి. 
 
ఈ విషయాన్ని రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిరుతపులి సంచారంతో వేములవాడ పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 
 
ఇక, బోయినపల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని వ్యవసాయ బావిలో చిరుతపులి కనిపించిన సంగతి తెలిసిందే. కోరెపు సురేష్‌కు చెందిన వ్యవసాయ బావిలో బుధవారం చిరుత పడి ఉండటాన్ని రైతులు గుర్తించారు. దీంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.